అవకాశాలు వస్తున్నాయి కదా అని అదే పనిగా సినిమాలు చేసుకుంటూ పోతే అంతే తొందరగా కెరీర్ ఆగిపోయే అవకాశం కూడా ఉంది. నేటి తరం హీరోల్లో ఈ లాజిక్ సరిగ్గా పట్టుకున్న నటుల్లో తేజ సజ్జా ఒకరు. చేసినవి కొన్ని సినిమాలైనా సరే మంచి గుర్తుండిపోయే పాత్రలే చేశారు తేజ. ఇక ఇటీవల విడుదలైన హనుమాన్ అయితే ఏకంగా బడా హీరోల సినిమాలతో పోటీ పడుతూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఆ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఊపులో మిరాయ్ అనే ఒక సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు తేజ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడే విడుదలైన ఫస్ట్ లుక్ హాలీవుడ్ స్థాయిలో ఉండడంతో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 18న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టుగా చిత్ర వర్గాలు వెల్లడించాయి.