“జగన్ ప్రభుత్వంలో సినిమా హీరోలను ఇబ్బంది పెట్టారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్ లాంటి స్టార్ హీరోలను కూడా గేట్ బయటే కార్లు ఆపించేసి, తన వద్దకు నడిచొచ్చేలా చేశారు. కనీసం భోజనం కూడా పెట్టకుండా పంపించారు” అని మొన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల క్యాంపెయిన్ లో భాగంగా విమర్శించారు. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వంలో తనతో విభేదించిన కృష్ణ గారిలాంటి హీరోలను కూడా అధికారంలో ఉండి కూడా ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు అంటూ జగన్ కి, ఎన్టీఆర్ కి వ్యక్తిత్వం మధ్య ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పే క్రమంలో పవన్ ది కేవలం జగన్ ని విమర్శించే ఉద్దేశమే తప్ప, కృష్ణ గారిని ఇందులో విమర్శించడానికి స్కోప్ ఎక్కడుంది.
ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడి గొప్ప పాలనను కూడా కృష్ణ విమర్శించడమేంటి అని పవన్ అనుంటే అప్పుడు అది కృష్ణ ని విమర్శించినట్టు అవుతుండే. కానీ అలాంటి విమర్శలు పవన్ చేయలేదు. కానీ ఎన్నికల వేళ ఏ చిన్న కామెంట్ ని ఐనా కూడా భూతద్దంలో చూస్తూ, ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టాలనే నాయకులు చూస్తుంటారు. అదే క్రమంలో ఈ సమయంలో కృష్ణ గారి అభిమానుల్ని రెచ్చగొడితే, ఇటు మహేష్ బాబు ఫాన్స్ కూడా రెచ్చిపోయి జనసేన పై తిరగబడతారని వైసీపీ చేస్తున్న రాజకీయం ఇది.
ఇటీవలే పవన్, సినిమాల పరంగా మనం ఎవర్ని అభిమానించినా కూడా రాజకీయంగా అందరం ఒకటవ్వాల్సిన అవసరం ఉంది. మహేష్ నాకంటే పెద్ద హీరో, ఆయన అభిమానులు కూడా నన్ను సపోర్ట్ చేయండి అంటూ బహిరంగంగానే తనని తాను తగ్గించుకొని పవన్ కోరారు. ఈ క్రమంలో వైసీపీ రగిల్చిన ఈ చిచ్చు జనసేన ని మరింత కుంగదీస్తుందా, లేదా నిజాలను గ్రహించి కృష్ణ, మహేష్ అభిమానులే పవన్ వెంట ఉంటారా అనేది చూడాలి.