పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్ ఎక్కువ కాలం మోయకుండా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరుచుకొని పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇతర హీరోల ఆడియో ఫంక్షన్లలో కూడా ఆడియన్స్ పవర్ స్టార్, పవర్ స్టార్ అంటూ కేకలేసే స్టార్ పవర్ ఆయనది. అలాంటి హీరో రాజకీయాల్లోకి వస్తున్నాడంటే కూడా అదే తరహా మ్యాజిక్ జరుగుతుందనుకున్నారు. కానీ సినిమా వేరు, రాజకీయం వేరు అని నిలబడిన రెండు చోట్ల పవన్ ఓడిపోయాకే క్లారిటీ వచ్చింది. ఈసారి కూడా పవన్ అసెంబ్లీ లోకి అడుగుపెట్టకుండా ఉంటే, ఇక పార్టీ పెట్టి పదేళ్లయినా కూడా ఏమి సాధించలేకపోయాడనే కామెంట్ నిస్సందేహంగా వినిపిస్తుంది. రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా పోయే అవకాశం ఉంది.
కాబట్టి ఈసారి పవన్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీకి దిగారు. ఈరోజు నామినేషన్ కూడా వేయనున్నారు. కానీ పోయినసారి ఓడిపోతే వచ్చిన బాధ, ఈసారి గెలిచినా కూడా ఆనందం పెద్దగా రాకుండా అదే బాధ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పవన్ గెలుపుని తన భుజాలపై ఏసుకొని, ప్రచారంలో ఎక్కువ శాతం టీడీపీ జెండాలే మోసుకుంటూ పవన్ అభిమానుల్ని సైతం అరుపులు, కేకలు వేయొద్దంటూ వారించే స్థాయికి వచ్చాడు.
పవన్ కూడా వర్మ కే పెద్ద పీట వేస్తూ, ఆయనవల్లే పోటీ చేయగలుగుతున్నాను, ఆయన నేను కలిసి పోటీ చేస్తున్నట్టే. ఆయనే నన్ను గెలిపించాలి అంటూ ఇలా అడుగడుగునా వర్మనే ఎత్తుకొని తిరగడం పవన్ అభిమానులకు మింగుడు పడడం లేదు. ఎమ్మెల్యే అయ్యాక కూడా వర్మ అడుగుజాడల్లోనే పవన్ నడుస్తూ, ఆయన ఆర్డర్స్ తీసుకుంటాడేమో అన్నట్టే ఉంది పరిస్థితి. కాబట్టి ఈసారి పవన్ గెలిచినా కూడా అభిమానులకు పెద్దగా ఊపునిచ్చే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి.