రాజకీయాల్లో సానుభూతి అనేది బండిలో పెట్రోల్ లాగా పనిచేస్తుంది. కానీ ఆ పెట్రోల్ కూడా నాణ్యమైనది ఐతేనేనండోయ్. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడి కూడా అటువంటిదే. సాధారణంగా అంత చిన్న రాయి తో దాడి ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకోదు. కానీ ఎన్నికల వేళ కాబట్టి, గోరు తో గీరినా గొడ్డలి వేటు అన్నట్టు చూపిస్తేనే కదా సానుభూతి పెరిగేది, ఓట్లు రాలేది. అందుకే జగన్ పై దాడిని ఆయన మీడియా ఐన సాక్షి ఏకంగా హత్యాయత్నం అంటూ టైటిల్ పెట్టి మరీ సానుభూతి స్టెంట్లు, ప్రతిపక్షాల పార్టీల పై దుమ్మెత్తిపోయడాలు చేయడానికి ఆస్కారం దొరికింది.
కానీ ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా, అక్కడ జరిగింది కేవలం ఒక చిన్న రాయి చిలక్కొట్టుడు అనేలా అయిన గాయం. ఆ గాయానికి వైద్యం అనడం కంటే చిన్న ఫస్ట్ ఎయిడ్ కూడా పూర్తవడంతో, దాని ద్వారా మైలెజ్ అంతటితో ఆగిపోయింది. ఇటువంటి దాడి అమానుషం అంటూ ప్రతిపక్షాలు కూడా దీన్ని ఖండించి, సానుభూతి మైలేజ్ అక్కడితో ఆపేశారు.
నిజానికి గడిచిన ఐదేళ్ల పాలనని వదిలేసి, కేవలం సరిగ్గా ఎన్నికల ముందే ఇలాంటి దాడులు జరుగుతుంటే, అవి అర్ధం చేసుకోలేనంత పిచోళ్లు జనం కాదు. వివేకానంద రెడ్డి హత్య లాంటి పెద్ద సంఘటన, జగన్ పార్టీ పై సానుభూతి తీసుకొచ్చి, అధికారం చేజిక్కించుకోవడానికి ఎంతోకొంత సాయపడిఉండొచ్చు గాని, కోడి కత్తి, రాయి దాడి లాంటి చిలక్కొట్టుడ్ల వల్ల మటుకు ఖచ్చితంగా ఉపయోగం అయితే ఉండదు.