యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న ఒక సినిమా, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి అన్ని భాషల్లో హిట్ కొట్టడం ఇప్పుడు సర్వ సాధారణం అవుతుంది. రీమేకులు పోయి, కేవలం డబ్బింగ్ తోనే ఇప్పుడు మొత్తం పనైపోతుంది, ఎందుకంటే కంటెంట్ బాగుంటే, నటుడు ఎవరు అనే పట్టింపులు ఇప్పుడు పోయాయి. ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికించిన కూడా, దానివల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ మూలాన, వరల్డ్ సినిమాలకి జనాలు అలవాటు పడడం మూలాన, చిత్ర రంగానికి ఈ బెనిఫిట్ లభించింది.
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలను బాలీవుడ్లో కూడా అంగీకరించిన జనం, యానిమల్ సినిమా ద్వారా రన్బీర్ కపూర్ ని తెలుగులో కూడా అంగీకరించడం విశేషం. బాహుబలి ప్రభావం బాలీవుడ్లో సాహోకి, రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్లకి కూడా ఓపెనింగ్స్ వచ్చేలా చేశాయి. కంటెంట్ బాగుంటే, ఏ హీరోనైనా నెత్తిన పెట్టుకోవడానికి మాకేం అభ్యంతరం లేదంటూ బాలీవుడ్ జనాలు చెప్పకనే చెప్పారు. అదే ధైర్యంతో ఇప్పుడు ఎన్టీఆర్ హిందీలో రితిక్ రోశన్ తో కలిసి వార్ 2 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మనోడు ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఆర్ఆర్ఆర్ ప్రభావం తో ఎన్టీఆర్ కి ఈ అవకాశం దక్కిందని కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా బాగుంటే హిందీ జనాలు, అందులోను వాళ్ళ హీరో ఐన రితిక్ రోషన్ తో కలిసి నటించే ఎన్టీఆర్ కి పట్టం కడతారు అనడంలో సందేహం లేదు.
అదే విధంగా తెలుగులో ఎన్టీఆర్ స్టార్ డం మూలాన, వార్ 2 కి ఇక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ తో పాటు, కలిసి నటిస్తున్న రితిక్ కి కూడా మనోళ్ల ప్రేమ దక్కుతుందా అంటే సందేహమే. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత హీరో వర్షిప్ ప్రపంచ సినిమాల్లో ఎక్కడా ఉండదు. ఇది ఎన్నోసార్లు ఇతర భాషల్లోని ఇండస్ట్రీ దిగ్గజాలు కూడా ఒప్పుకున్న సత్యం. కాబట్టి వార్ 2 తెలుగు లో రితిక్ ఒక సెకండ్ హీరో లా అనిపించే అవకాశమే ఎక్కువగా ఉంటది. రితిక్ సోలో సినిమాతో వస్తే, యానిమల్ లాగ ఆ సినిమా వరకు కంటెంట్ బాగుంటే హిట్ అవొచ్చేమో గాని, సాహో, రాధే శ్యామ్ లాంటి డిసాస్టర్ సినిమాలకు కూడా మంచి ఓపెనింగులు ఇచ్చిన బాలీవుడ్ ఆడియన్స్ కి ఉన్నంత పెద్ద మనసు, ఖచ్చితంగా మనోళ్ళకి ఉండే అవకాశం ఉండదు. ఇది గతంలోనే అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా విడుదలైన విక్రమ్ పాత సినిమాల రిజల్ట్ తో చూసాం.